ప్రభుత్వ పథకాలను అమ్ముకుంటున్న సర్కార్
– ప్రజా పాలన కాదు రాష్ట్ర మంతా రాక్షస పాలన
– శాడిస్టిక్ ఆనందం పొందుతున్న సీఎం రేవంత్
– తాండూరులో డబుల్ ఇళ్లను ప్రైవేటుకు ఇవ్వడం ఘోరం
– జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులపై కోర్టుకు వెళతాం
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డా.మెతుకు ఆనంద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ పథకాలను ప్రైవేటు వ్యక్తులకు దాసోహం చేసే పరిస్థితిని తీసుకవచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ విమర్శించారు.

ఆదివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న తాండూరు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని ఖండించారు. కేసీఆర్ హాయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు రావడం దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెట్టడం ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సిగ్గుచేటని అన్నారు.

కేవలం ఒకే సామాజిక వర్గానికి 200 ఇళ్లను కేటాయించడం ఘోరమని అన్నారు. తాండూరులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సామాజిక వర్గాలలో అర్హులైన వారందరికి ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సెలవు దినం అని తెలిసి ఓ సంస్థ ఇండ్ల పంపిణీకి కుట్ర చేయడంలో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సొంత జిల్లాలో జరుగుతున్న పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డికి, తాండూరు ఎమ్మెల్యేకు, మున్సిపల్ చైర్ పర్సన్‌కు తెలియకుండా జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న కార్యక్రమానికి అధికార కౌన్సిలర్లు మద్దతు తెలపడం సిగ్గుచేటని అన్నారు. చివరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇండ్ల పంపిణీ కోసం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్పందించడం యూ టర్న్ రాజకీయాలకు నిదర్శమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎవ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రైవేటు సంస్థలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారులు కూడా కుమ్మక్కు అవుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ అక్రమాలు అడ్డుకుంటే ప్రతిపక్ష పార్టీల గొంతునొక్కి.. నిర్భంద పాలన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన కాదని, రాక్షస పాలన చేస్తోందని ద్వజమెత్తారు.

ప్రతిపక్షాలను నిర్బంధం చేస్తూ, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి శాడిస్టిక్ ఆనందం పొందుతున్నారని అన్నారు. చిత్తశుద్ది ఉంటే 99 రోజుల ప్రణాళిక కాదు 999 రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను, వనరులను దౌర్జన్యంగా లాక్కోని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధారదత్తం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తాండూరులో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల అవినీతిపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమీషనర్, తహసీల్దార్లపై కోర్టుకు వెళతామని అన్నారు. మరోవైపు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ తాండూరులోని 200 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రైవేటు సంస్థకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రైవేటు సంస్థతో ఎమ్మెల్యే లాలూచీ పడ్డారని విమర్శించారు. అధికారుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు.

ఒక సామాజిక వర్గానికి ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించడం అన్ని వర్గాల మద్య చిచ్చుపెట్టే ప్రయత్నమే అని అన్నారు. ఈ పరిణమాలతో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహించాలని, క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల అవినీతికి ప్రమేయం ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, శ్రీనివాస్ చారి, పార్టీ మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు సిద్రాల శ్రీనివాస్, ఆసిఫ్, కౌన్సిలర్లు జావిద్, సుప్రీత, నాగలక్ష్మీ, నవీనా సంతోష్ గౌడ్, సురేష్ నాయక్, అనిల్, యోగానంద్, మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ గౌడ్, రుద్రుపాటిల్, కరుణాకర్, ఎజాజ్, ఇంతియాజ్, సంజీవరావు, ఫిరోజ్ ఖాన్, బషరత్ తదితరులు పాల్గొన్నారు.

