జిల్లాకు ఆయిల్‌ ఫామ్ ఫ్యాక్టరీ తెస్తాం

తెలంగాణ

జిల్లాకు ఆయిల్‌ ఫామ్ ఫ్యాక్టరీ తెస్తాం
– పాలమూరు, ప్రాణహితలతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం
– ప్రాజెక్టులను పూర్తి చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం
– ప్రకృతి వ్యవసాయంలో ట్రేడ్ మార్క్‌గా నిలవాలి
– వ్యవసాయంపై నమ్మకం పెంచేందుకే టీజీ ఆర్గానిక్ యాప్
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
– తాండూరులో అట్టహాసంగా రైతు వారోత్సవాలు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాకు అయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తప్పక తీసుకవస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి 9వ తేది వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వారోత్సవాలు తాండూరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టీజీ ఆర్గానిక్ యాప్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వ్యవసాయ శాఖ కమీషనర్ సురేంద్రమోహన్, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, జిల్లా కలెక్టర్ దీపక్ తీవారి, మార్కెట్ కమిటిల చైర్మన్లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు రైతు వారోత్సవాలలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులు ఏర్పాటు చేసిన పలు ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించారు.

అనంతరం సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎన్ని ఇబ్బందులు, కుట్రలు చేసినా కాంగ్రెస్ సర్కారు రైతు సంక్షేమాన్ని వీడలేదని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. అదేవిధంగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లీ భూమాతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రసాయన ఎరువులను వాడకం వల్ల పంజాబ్ వంటి రాష్ట్రాలలో క్యాన్సర్‌ రోగులు పెరిగి, ప్రత్యేక రైళ్లను నడిపించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా అందరు ప్రకృతి వ్యవసాయం చేయాలని అన్నారు. నాగర్‌ కర్నూల్ జిల్లాకు చెందిన మహిళ రైతు లావణ్య రమణా రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

రైతులకు వ్యవసాయంపై భరోసా కల్పించేందుకే ప్రభుత్వం టీజీ ఆర్గానిక్ యాప్‌ను ప్రవేశ పెడుతుందని అన్నారు. ఇందులో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు అన్ని ఉంటాయని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రకృతి వ్యవసాయంలో ట్రేడ్‌ మార్క్‌గా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా 9వ తేది వరకు జరిగే రైతు వారోత్సవాలలో రైతులు, అధికారులు, సైంటిస్టులు సమ్వనయం చేసుకోవాలని సూచించారు.

ప్రాణహితను పూర్తి చేయడమే సీఎం లక్ష్యం
ఉమ్మడి జిల్లా మళ్లీ సస్యశ్యామలం కావాలంటే నీటి ప్రాజెక్టులతోనే సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేవేళ్ల ప్రాణహితను పక్కన పెట్టి కాలేశ్వరం ప్రాజెక్టుతో అవినీతికి పాల్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవేళ్ల ప్రాణహితను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఈనెల 7న ప్రాణహితను ప్రారంభిస్తారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు, చేవేళ్ల ప్రాణహిత ప్రాజెక్టు, కోడంగల్ ఎత్తిపోతల పథకాలు ప్రారంభమైతే రాష్ట్రానికి మనుగఢ సాధ్యమవుతుందని అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని విస్మరించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో కోట్‌ పల్లి ప్రాజెక్టుకు నిధులు సాధించడం జరిగిందని గుర్తుచేశారు. యాలాల శివసాగర్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. తాండూరు మార్కెట్ యార్డుకు మంచి పేరుందని తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల దృష్టికి తెచ్చారు. అదేవిధంగా తాండూరులో కొత్త మార్కెట్ యార్డు టెండర్ ప్రక్రియలో ఉందని, దీంతో పాటు మార్కెట్ కమిటిలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

తాండూరులో టీజీ ఆర్గానిక్ యాప్‌ ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు. రైతులంతా అధికారులు, సైంటిస్టులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. అనంతరం యాలాల మండలం జుంటుపల్లి దగ్గరలో గల డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్ ఫాం ఆయిల్ తోటను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, ఏఏంసి చైర్మన్ లు పట్లోళ్ళ నర్సింలు, అంజయ్య, మాధవ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్..!