ఎమ్మెల్యేపై పెట్టింది కేసు కాదు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేపై పెట్టింది కేసు కాదు
– విచారణకు ఆదేశించిన కోర్టు
– కేసును తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్ నాటకం
– ప్రతిపక్ష పాత్రలో గులాబీ నేతలు విఫలం
– డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై పెట్టింది కేసు కాదని, బీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసును తప్పించుకునేందుకు నాటకీయతకు తెరలేపారని డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ అన్నారు.

శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యేపై నమోదైన ఎఫ్ఐఆర్‌ విషయంలో పలు విషయాలను పంచుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్య రభస జరిగిన సంగతి అందరికి తెలిసిందే అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన అనుచరులతో హంగామా సృష్టించడంతో పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని గుర్తుచేశారు.

దీంతో పాటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అనుచరులపై నాన్ బేయిలెబుల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీని నుంచి తప్పించుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అనుచరులపై కౌంటర్ బ్లాస్ట్ వ్యూహాని ప్రయోగించారని విమర్శించారు. న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తే కౌంటింగ్ కేంద్రంలో జరిగిన సంఘటనపై విచారణ జరపాలని, ఎమ్మెల్యే విషయంలో పూర్వపరాలు పరిశీలించాలని మాత్రమే కోర్టు ఆదేశించిందని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేపై చేసిన ఫిర్యాదు అసత్య ఆరోపణలతో కూడుకుందని అన్నారు. ఎమ్మెల్యేపై పెట్టింది కేసు కాదని అన్నారు. ఇది విచారణ దశ మాత్రమే అని అన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యేకు దక్కుతున్న ఆదరణను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. ఎమ్మెల్యేపై జరగుతున్న కుట్రను తాండూరు ప్రజలు తప్పక గుర్తిస్తారని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల పూర్తి విశ్వాసంతో ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయన్నారు. తమపై నమోదైన కేసును చట్టపరంగా ధైర్యంగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉందని.. సత్యమే విజయం సాధిస్తుందని అన్నారు.

ఘనంగా రాకేష్ గౌడ్ జన్మదినం