బురద జల్లే రాజకీయాలు మానుకోండి..!
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కక్ష్య కడితే ఊరుకోం
– మభ్య పెట్టి, మోసం చేసిన పాలన బీఆర్ఎస్‌దే
– దమ్ముంటే ఎమ్మెల్యే అవినీతిని నిరూపించండి
– మీడియా సమావేశంలో చైర్ పర్సన్, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని, కక్ష్య పూరిత పోకడలకు పోతే ఊరుకునేది లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ద్వజమెత్తారు.

శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు, తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మండల అధ్యక్షులు రాజ్ కుమార్, పెద్దేముల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాజవర్దన్ రెడ్డి, నాయకులు జన్నె నాగప్ప, అమీర్ అబ్దుల్లా తదితరులు వేరు వేరుగా మీడియాతో మాట్లాడారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అనుచర నేతలపై కోర్టు ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడాన్ని ఖండించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నేతలు చేసిన రచ్చ అందరికి తెలిసిందే అని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిస్తున్న సమయంలోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కేంద్రంలోకి వెళ్లకుండా మీడియా పాయింట్ వద్దకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం పట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేకు ఆధరణ, అభ్యర్థుల గెలుపును జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నేతలు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన తీరు గుండాయిజాన్ని తలపించిందని అన్నారు. ప్రజలకు మంచి చేసి ఉంటే ఈ రోజు ఎమ్మెల్యే స్థానంలో వాళ్లే ఉండేవారని అన్నారు.

గత ఐదేళ్లు అక్రమాలు, అవినీతి చేసింది బీఆర్ఎస్ పార్టీ నేతలే అని ఆరోపించారు. తాండూరు ప్రజలకు మంచి చేస్తున్న మనసున్న మహారాజు మనోహర్ రెడ్డి అని, ఆయనతో కలిసి రావాలి తప్పా బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని అన్నారు. కేసు నమోదు చేయించుకునేంత తప్పు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏనాడు చేయబోరని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దురాగతాలకు అన్ని ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అవినీతిని ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న మబ్య పెట్టే తీరును ప్రజలు ఎవ్వరు నమ్మరని అన్నారు.

ఇలాంటి మోసగాళ్లను నమ్మరాదని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్‌గా ఉన్న తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం బీఆర్ఎస్ పార్టీ నేతల సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు హబీబ్ లాల విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, దివిలి ఎల్లప్ప, జుంటుపల్లి వెంకట్, పోలీస్ బాలకృష్ణారెడ్డి, నాయకులు నారా శ్రీకాంత్, రాజు తదితరులు ఉన్నారు.


