దివ్యాంగురాలుకు బుయ్యని భరోసా
– ఫించన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు హామి
– కాన్వాయ్ ఆపి ఆమెతో మాట్లాడిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ దివ్యాంగురాలుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భరోసా అందించారు.

వికలాంగ ఫించన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా అంతారం తండా నుండి వస్తున్న సమయంలో మల్ రెడ్డి పల్లి రహదారి పక్కన కూర్చొని సహాయం కోరుతున్న దివ్యాంగ మహిళను గమనించారు.

వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన వాహనాన్ని ఆపి ఆమె వద్దకు వెళ్లి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగురాలు తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని ఎమ్మెల్యేను వేడుకుంది. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హత ప్రకారం దివ్యాంగ పింఛన్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫించన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చూస్తామని దివ్యాంగురాలుకు భరోసా అందించారు. అంతకుముందు ఆమెతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడి ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.


