మాతా శిశు ఆసుపత్రికి ఇదేం దుర్గతి..?

తాండూరు రాజకీయం వికారాబాద్

మాతా శిశు ఆసుపత్రికి ఇదేం దుర్గతి..?
– ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం
– రోగులకు అందని మెరుగైన వైద్య సేవలు
– రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్
– బాలికల పట్ల వరుస అఘాయిత్యాలపై ఫైర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి పరిస్థితి దిగజారి పోతోందని రాజీవ్ కాలనీ మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు.

శుక్రవారం మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో పలు వార్డులు తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యులు అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ఆసుపత్రిలోని వార్డుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆసుపత్రిలోని ఓ వార్డులో పైకప్పు నుంచి లీకేజీల చూసి ఆశ్చర్య పోయారు. ఆసుపత్రి స్లాబ్‌పై నీరు నిల్వ ఉండడం, శుభ్రం చేయకపోవడం చూసి అసహనం చెందారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మాతా శిశు ఆసుపత్రికి ఇదేం దుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హాయాంలో ఎన్నో ఉత్తమ సేవలను అందించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాతా శిశు ఆసుపత్రి నిర్వహణపై నిర్లక్ష్యం రాజ్యమేలుతుందని అన్నారు. ఇక్కడ సరైన వైద్యులు అందుబాటులో లేరని, ఆపరేషన్లు చేయడం లేదని అన్నారు. మందులకు బయటకు పంపిస్తున్నారని, కొన్ని ప్రసూతి కేసులను ప్రైవేటు ఆసుపత్రికి పంపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రిని మెరుగు పరచడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాండూరులో అవినీతి అక్రమాలు పెచ్చుమీరుతున్నాయని, జరుగుతున్న పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్దిచెప్తారని అన్నారు.

అమ్మాయిలపై అఘాయిత్యాలు ఘోరం
మరోవైపు తాండూరులో బాలికలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాండూరులో యూపీకి చెందిన యువకుడు బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా బషీరాబాద్‌ మండలంలో 7ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఉందంతం భయాందోళను కలిగిస్తున్నాయన్నిరు. ఇవి మరువక ముందే యాలాల మండలంలో 14ఏళ్ల బాలికపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన కలవర పెడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు రావడం శోచనీయమని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు.

చార్జర్‌, నీళ్లు కావాలని వచ్చి..!