‘సాదా’ రైతులకు కొత్త పట్టాలు..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్


‘సాదా’ రైతులకు కొత్త పట్టాలు..!

– భూముల క్రమబద్దీకరణకు కసరత్తు
– తెల్లకాగితపై భూమి అమ్మకాలకు భరోసా
– భూ భారతి చట్టం ద్వారా అమలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సాదాబైనామా రైతులకు కొత్త పట్ట పాసుపుస్తకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగితాలపై రాసుకుని భూములు కొనుగోలు చేసి హక్కులు పొందాలని చూస్తున్న రైతులకు ఇది సువర్ణ అవకాశం.
kvcs
రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన రెవెన్యూ చట్టం(భూభారతి) ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు తెల్ల కాగితాలపై భూములు కొనుగోలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 జూన్‌ 2తేదికి ముందు కొనుగోలు చేసిన సాదాబైనామా భూములకు హక్కులు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో కొన్ని ఇబ్బందులు రావడంతో పెండింగ్‌లో ఉండిపోయాయి. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి ద్వారా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు దృష్టి సారిస్తోంది. సమస్యలు పరిష్కరామైతే తెల్లకాగితం రైతులకు కొత్త పాసు పుస్తకాలు పొందుతారు.

పరిశీలన ఇలా..
గతంలో ప్రభుత్వాలు ప్రకటించిన విధంగా చాలా మంది రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం నిభంధనలు పెట్టింది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తితో పాటు విక్రయించిన వారికి నోటీసు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి పంచనామ నమోదు చేస్తారు. అనంతరం ఆర్డీఓ ద్వారా సమస్యకు పరిష్కారం చూపుతారు. విక్రయించిన వ్యక్తి చనిపోతే వారి వారసుల వాంగ్మూలం రికార్డు చేస్తారు. భూమిని విక్రయించినప్పటికి.. ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా వివాదాలు సృష్టించాలని భావిస్తే చుట్టుపక్కల రైతుల వాంగ్మూలాలు సేకరిస్తారు. అనంతరం విచక్షణ అధికారంతో అధికారి తీర్పును వెల్లడిస్తారు. ఇలా అర్హత పొందిన రైతులకు సాదాబైనామా భూములకు పట్టా పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు.

నిబంధనలు ఇవే
కొత్త రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించేందుకు నిబంధనలు విధించారు. 2024 జూన్ 2వ తేది ముందు కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకుంటారు. కొనుగోలు చేసిన వ్యక్తి సదరు భూమిలో సాగులో ఉండి తీరాలి. సాదాబైనామా కోసం 2020లో అక్టోబర్ – నవంబర్‌లో అప్పటి ప్రభుత్వం అవకాశం కల్పించిన సమయంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు తప్పనిసరిగా చేసి ఉండాలి. వాటిని మాత్రమే పరిష్కరించేందుకు అవకాశం ఉంది.

రైతుల అవవస్థలు
తెల్లకాగితాలతో భూములు కొనుగోలు చేసిన రైతులు కొనుగోలు నాటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాసు పుస్తకాలు లేక రైతు భరోసా, రైతు బీమా పథకాలకు దూరం అయ్యారు. బ్యాంకుల్లో రుణాలు కూడా పొందడం లేదు. భూముల విలువ పెరగకపోవడంతో అప్పట్లో అమ్మిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇప్పటికే అమ్మిన వారి పేర్లే కనిపించడం.. డిజిటల్ సంతకాలు, ఆధార్‌, ఈకేవైసీ పెండింగ్‌లో ఉండడంతో అవస్థలు తప్పడం లేదు.

ఇదికూడ చదవండి….

తాండూరులో కొత్త కాలనీ..!