గుంతలపై పూత.. దుమ్ముతో రోత..!
– రోడ్లపై విరజిమ్ముతున్న ధూళీ
– ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుంతలు.. దుమ్ము.. ధూళీతో వేగలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా తాండూరు – చించొల్లి రోడ్డుతో పాటు తాండూరు – కోడంగల్ రోడ్డుమార్గంలో ఈ సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడ్డ గుంతలతో వాహనాలు కూరుకుపోవడం, కొన్ని చోట్ల వాహనాలు బొల్తాపడిన సంఘటన జరిగాయి. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సహాకారంతో రోడ్లపై ఏర్పడ్డ గోతులకు తాత్కాళిక మరమ్మత్తులు చేయించారు.
ఇటీవల మళ్లీ కురిసిన భారీవర్షాలతో రోడ్లు మళ్లీ దెబ్బతిన్నాయి. ఈమద్యలోనే వినాయక చవితి కూడ వచ్చింది. నిమజ్జన ఉత్సవాలలో రోడ్లపై గుంతల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గోతులను కంకరతో పూడ్చారు. ఇది మంచి ప్రయత్నమే అయినా.. ప్రస్తుతం ఈ గుంతలో పూడ్చిన కంకరతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కంకరపై నుంచి ఏ వాహనం వెళ్లినా దుమ్ము..ధూళీ విపరీతంగా చెలరేగిపోతుంది. దీంతో ఆ వాహనం వెనుక వచ్చే వాహనదారులతో పాటు పక్కనుంచి వెళ్లే పాదాచారులపై దుమ్ము.. ధూళీతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వేసిన కంకరపూత నుంచి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీంతో పాటు పట్టణంలోని రోడ్లను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
