హ్యామ్‌కు ముహుర్తం ఖరారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హ్యామ్‌కు ముహుర్తం ఖరారు..!
– 16న రూ. 290 కోట్ల పనులకు శంకుస్థాపన
– తాండూరుకు విచ్చేస్తున్న మంత్రులు
– కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, గడ్డం ప్రసాద్, శ్రీధర్ బాబుల రాక
– అదే రోజు బైపాస్ భూ నిర్వాసితులకు పరిహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా హ్యామ్‌(హైబ్రీడ్‌ యాన్యుటి మోడల్‌) ద్వారా తాండూరు నియోజకవర్గంలో చేపట్టే పనులకు ముహుర్తం ఖరారయ్యింది.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 16న అభివృద్ధి పనులకు శంకస్థాపనలు చేసేందుకు నిర్ణయించారు. హ్యామ్ ద్వారా తాండూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 290 కోట్లను మంజూరు చేసింది.

ఈ నిధులతో చేపట్టే పనులను ఈనెల 16న రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం మంత్రుల పర్యటన ఖరారయ్యింది. 16వ తేదిన తాండూరు పట్టణ సమీపం అంతారం పరిధిలో శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా అదేరోజు కందనెల్లి సమీపంలోని జీపీఆర్‌ గార్డెన్‌లో సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సభలో తాండూరు బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులకు మంజురైన రూ. 25 కోట్ల పరిహారాన్ని అందజేయనున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జీపీఆర్‌ గార్డెన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రుల పర్యటనను, అభివృద్ధి పనుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, పార్టీ నేతలు, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐలు పరమేశ్వర్ గౌడ్, ప్రవీణ్‌ కుమార్ తదితరులు ఉన్నారు.

రక్తదానం చేసిన తండ్రి, కొడుకులు