తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి
– ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చాలి
– జేఏసీ తాండూరు నియోజకవర్గ చైర్మన్ సోమశేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని తెలంగాణ జేఏసీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ సాంబూరు సోమశేఖర్ అన్నారు.

సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులతో జరిగిన సమావేశంలో సోమశేఖర్‌తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సోమశేఖర్ ఎమ్మెల్సీ ఫ్రోఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది ఉద్యమకారులు తమ విద్య, ఉద్యోగాలు, కుటుంబాలు, ఆస్తులు, స్వేచ్ఛను పణంగా పెట్టి తెలంగాణ సాధన కోసం అహర్నిశలు పోరాడారని గుర్తుచేశారు.

గత ప్రభుత్వం ఉద్యమ కారులను విస్మరించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఉద్యమ కారులను ప్రత్యేకంగా గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలలో, ఉద్యోగ రంగాలలో ప్రత్యేక స్థానం కేటాయించాలని అన్నారు. ఇండ్లు, ఫించన్, ఉచిత విద్య, ప్రైవేటు ఉద్యోగఅవకాశాలు కల్పిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చాలని కోరారు.

ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం, గౌరవం శాశ్వతంగా పరిరక్షించబడే విధంగా ప్రత్యేక చట్టం తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరుకు చెందిన ఉద్యమ కారులు ఫిరోజ్ ఖాన్, బంటారం భద్రేశ్వర్, రియాజ్ తదితరులు ఉన్నారు.


