కరువు మాపు.. ఈశ్వరా..!
– భక్తిశ్రద్దలతో వరద పాశం
– సాయిపూర్‌లో వర్షాల కోసం మొక్కలు
– పూజలో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరువు పరిస్థితులను రాకుండా చూడయ్యా ఈశ్వరా అంటూ తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంత ప్రజలు శివుకున్ని వేడుకున్నారు.

సోమవారం సాయిపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, రైతుల ఆధ్వర్యంలో వరద పాశం కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. సాయిపూర్ నుండి రాజీవ్ కాలనీలోని ఇప్పల పరమేశ్వర దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్ర దంపతులతో పాటు కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, శ్రీకాంత్ లు హాజయ్యారు. వారు రైతులు, భక్తులతో కలిసి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రాదాయ పద్దతిలో వరద పాశం పోశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, చెరువులు, కుంటలు నిండాలని శివయ్యను వేడుకున్నట్లు తెలిపారు. ప్రకృతి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సాయిపూర్ నాయకులు, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


