మూడు నెలల బియ్యం.. మళ్లీ..!
– ఒకే సారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
– కసరత్తు చేస్తున్న పౌరసరఫరాల శాఖ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : రేషన్ లబ్దిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యి మళ్లీ అందించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. గతంలో వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ వరకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేశారు.

తాజాగా ఈ మూడు నెలల రేషన్ బియ్యం మళ్లీ ఒకేసారి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లాలో 2లక్షల 89వేల 736 మంది రేషన్ లబ్దిదారులు ఉన్నారు. కుటుంబంలో ఒక్కోక్కరికి 6 కిలోల చొప్పున 6,399.959 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

గతంలోని మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ జూన్ వరకు ముగిసిపోగా జులై రేషన్ కోటాను పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని మాత్రం ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేయబోతున్నారు. వచ్చే నెల ఆగస్టులో ప్రతి రేషన్ కార్డుపై ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

పాత విధానంలోనే పంపిణీ
ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఈ-పోస్ మెషీన్‌లో మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దాంతో ఒక్కో వినియోగదారుడికి బియ్యం ఇవ్వడానికి సమయం కాస్త ఎక్కువ పడుతుంది. ఈ విధానం వల్ల రేషన్ డీలర్లు కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కావున లబ్దిదారులు వారికి సహకరించక తప్పదు.


