శ్రీనేతాజీలో ఎన్నికల కోలాహలం..!
– హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఎలక్షన్స్
– ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు
– విజేతలను అభినందించిన డైరెక్టర్ మణిమాల
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శ్రీనేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. శనివారం పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఎలక్షన్స్ నిర్వహించారు.

ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ఎన్నికల్లో ఉత్సహాంగా పాల్గొన్నారు. ఎన్నికల కోసం విద్యార్థులు ప్రత్యేక గుర్తింపు కార్డుతో బారులు తీరారు. ప్రత్యేక బ్యాలెట్ బాక్సులలో ఓటు వేసిన పత్రాలను వేశారు. ఉదయం నుంచి పాఠశాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్కూల్ మొత్తం అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఈ ఎన్నికల్లో హెడ్ బాయ్‌గా లక్ష్మీ మోక్షిత్, హెడ్ గర్ల్‌గా ప్రతిక ఎన్నికయ్యారు.

విజేతలను పాఠశాల డైరెక్టర్ మణిమాల అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికల విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావనను పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఓటు హక్కును వినియోగించడం ద్వారా ఎన్నికల ప్రాముఖ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


