హౌస్‌ ఓనర్‌కే మస్కా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

హౌస్‌ ఓనర్‌కే మస్కా..!
– యజమాని బంగారంతో జంప్‌ అయిన కి’లేడి’
– తెలిసిన మహిళే అని ఇంట్లోకి రానిస్తే ఎగనామం
– లబోదిబో మంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
– తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత ఇంటి యజమానికి కలవడానికి వచ్చిన ఓ మహిళ ఆ ఇంట్లో బంగారు ఆభరణాన్ని ఎత్తుకువెళ్లిపోయింది. క్షణాల్లో మస్కా కోట్టి పారిపోవడంతో లబోదిబో మన్న యజమానురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఈ సంఘటన బుధవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. తాండూరు పట్టణం మార్వాడి బజార్‌లో వైద్యలింగం, విజయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. 8నెలల క్రితం ధారూర్‌కు చెందిన నీరటి స్వరూప వీరింట్లో ఓ మహిళ అద్దెకు ఉండేది. కొన్ని నెలల క్రితమే ఆమె ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.

అయితే మంగళవారం తాండూరులో ఓ ఫంక్షన్‌ కోసం వచ్చిన స్వరూప మార్వాడి బజార్‌లో ఉంటున్న యజమానులు వైద్యలింగం, విజయమ్మ ఇంటికి పలకరించేందుకు వెళ్లింది. విజయమ్మ మెడలో ఉన్న బంగారు ఆబరణాన్ని చూసిన మహిళ తాను కూడా అలాంటి డిజైన్‌తో బంగారం చేయించుకుంటాని, ఒక ఫోటో తీసుకుంటానని నమ్మబలికింది.

విజయమ్మ బంగారు ఆభరణాన్ని తీసి ఆ మహిళ చేతికి ఇచ్చింది. ఫోటో తీసుకుంటుండగానే విజయమ్మను ఎవరో పిలవగా ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇంతలో మహిళ బంగారు ఆభరణంతో ఉడాయించింది. బయటకు వచ్చి చూసే సరికి మహిళ కనిపించకపోవడంతో లబోదిబోమంది. చుట్టు పక్కలా విచారించగా ఫలితం లేకుండా పోయింది. దీంతో బుధవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ తీసుకెళ్లిన బంగారు ఆభరణం 3తులాల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సిరిధాన్యాలతో ఆరోగ్య పరిరక్షణ