కాళికాదేవి, నగరేశ్వర.. ఆలయాలకు కొత్త పాలక మండళ్లు..!
– ట్రస్టు బోర్డుల భర్తీకి రంగం సిద్ధం
– ఆలయాల పాలక మండళ్లకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని శ్రీ కాళికాదేవి, శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానాలకు నూతన పాలక మండలి (ట్రస్టు బోర్డు) సభ్యుల నియామకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దేవస్థానాల ఈఓ టీ. నరేందర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి 20 రోజులలోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సహాయ కమిషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి పంపించాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి పాలక మండలి సభ్యుల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఉప కమిషనర్, దేవాదాయ శాఖ, హైదరాబాద్ వారు నోటిఫికేషన్ జారీ చేయగా, శ్రీ కాళికాదేవి దేవస్థానానికి సంబంధించి కమిషనర్, దేవాదాయ శాఖ, హైదరాబాద్ వారు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఓ వివరించారు.


