ఇసుక రవాణాపై పోలీసుల పంజా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇసుక రవాణాపై పోలీసుల పంజా..!
– రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టివేత
– కాగ్నా నది నుంచి తరలింపుకు బ్రేక్
బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కాగ్నా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బషీరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.

వీర్‌శెట్టిపల్లి కాగ్నా నది నుంచి ఇసుకను తరలిస్తూ కాసింపూర్‌ వద్ద వెళ్తున్న ట్రాక్టర్లను బ్లూకోట్స్‌ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాటిని బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాలుగు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌ తెలిపారు. కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపుపై నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లను పట్టుకోవడం.. కేసులు నమోదు చేయడం.. ఆ తర్వాత తూతూమంత్రంగా వ్యవహరించి వదిలేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పట్టుబడిన ట్రాక్టర్లపై కేసులతో సరిపెట్టకుండా అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇసుక దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అర్ధరాత్రి ఆసుపత్రుల్లో తనిఖీ..!