తాండూరు అభివృద్ధికి నిధుల వరద

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు అభివృద్ధికి నిధుల వరద
– రూ.154 కోట్లతో ప్రగతి ప్రణాళికలు
– ఏడాదిలో కాగ్నా జలాలు అందిస్తాం
– తాగునీరు, రోడ్లు, డ్రైనేజీకి ప్రాధాన్యం
– వైద్య సేవల మెరుగుకు ఆరు బస్తీ దవాఖానాలు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మంగళవారం ఆర్యవైశ్య కళ్యాణమండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాండూరు పట్టణానికి కాగ్నా నది నుంచి తాగునీటిని అందించేందుకు రూ.110 కోట్లతో చేపడుతున్న పనులను ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు నీరందించడమే లక్ష్యమన్నారు. 30–35 ఏళ్ల క్రితం వేసిన పైప్‌లైన్ల వల్ల సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటికి మరమ్మతులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూతన కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.25.8 కోట్లతో పైప్‌లైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.18 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను దశలవారీగా మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాండూరులో ఆరు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. మాతా శిశు ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సహకారంతో మున్సిపల్ పరిధిలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. వార్డుల్లో సమస్యలను గుర్తించి, సత్వర పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్‌రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

చీకట్లో గుప్త నిధుల వేట..!