సమాన పని.. సమాన స్టైపెండ్ ఇవ్వాలి..!
– తాండూరులో ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌ల ఆందోళన
– ఈనెల 14 నుంచి డీఎంఈ వద్ద నిరసనకు సిద్దం
– నెలకు రూ.29,792తో పాటు బకాయిలు చెల్లించాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఆర్‌ఎంఐ ఇంటర్న్‌షిప్ చేస్తున్న విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు (ఎఫ్‌ఎంజీ) స్టైపెండ్ సమస్యపై ఆందోళన చేపట్టారు.

గురువారం తాండూరు మెడికల్ కాలేజీ వద్ద నిరసన కొనసాగించారు. ఇతర ఇంటర్న్‌లతో సమానంగా ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న తమకు నెలకు రూ.29,792 స్టైపెండ్‌తో పాటు అర్హత ఉన్న కాలానికి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

చాలామంది ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లకు స్టైపెండ్ అందడం లేదని, కొందరికి నెలకు రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని వారు తెలిపారు. ఈ సమస్యపై సెప్టెంబర్ 23న డీఎంఈకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటివరకు సంతృప్తికరమైన లిఖితపూర్వక పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.

దీంతో గురువారం నుంచి ఓపీ విధులను నిలిపివేసి శాంతియుత నిరసన చేపట్టినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్ 14 నుంచి డీఎంఈ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపడతామని వెల్లడించారు. ఎఫ్ఎంజీ ఇంటర్న్‌లకు సమాన స్టైపెండ్ అమలు చేసి, బకాయిలను చెల్లించేలా ప్రభుత్వం, డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


