తెలంగాణలో ఇద్దరికి ఒమిక్రాన్
– వైద్యుల పర్యవేక్షణలో బాధితులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వెరియంట్ ఒమికక్రాస్ తెలంగాణకు పాకింది. రాష్ట్రంలో మూడు కేసులు నమోదయినట్లు గుర్తించారు. అందులో ఇద్దరు హైదరాబాదీలు కాగా, మరొకరు బెంగాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చినవారు.. టోలిచౌకి, మెహదీపట్నం వాసులుగా ఉన్నట్లు తేలింది.
వీరిలో ఒకరు కెన్యా నుంచి, మరొకరు సోమాలియా నుంచి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరూ కూడా నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి రావడం గమనార్హం. మరో కేసుకు సంబంధించి ఓ 7 ఏళ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయినప్పటికీ.. అతను బెంగాల్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ బాలుడు విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి.. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్‌లో కోల్‌కల్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
దీంతో అక్కడి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతానికి రెండు యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. వీరిని గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ అని తేలినవారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించారు. మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నమోదు నేపధ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. వందశాతం వాక్సీనేషన్ పూర్తి కాని జిల్లాలో వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


