యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవ్..!
– వానాకాలం పంటలపై ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయండి
– రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
– కలెక్టర్ల మీటీంగ్‌లో సీఎం కేసీఆర్ కీలక వాఖ్యలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, కిలో వడ్లు కూడా కొనే పరిస్థితి లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. యాసంగి పంటలు సాగు, దళితబంధు, కొత్త జోనల్ ఉద్యోగుల విభజన అంశాలపై సీఎం కేసీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ అధికారులకు చెప్పారు. ప్రధానంగా పత్తి, వరి, కంది సాగు పై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా రైతులను సమాయత్తం చేయాలన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాల నుంచి రాష్ట్ర రైతుల్ని కాపాడాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు.
త్వరలోనే దళితబంధు నిధులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బందుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలోనే రూ. 10లక్షల చొప్పున అందజేస్తామన్నారు. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళితబంధును ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామని వివరించారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.
నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ
కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన ఉండాలన్నారు. నూతన జోనల్ వ్యవస్థతో ఇది అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ స్పష్టంచేశారు.
నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.