హ్యాపీ.. హ్యాపిగా క్రిస్మస్..!
– మార్మోగిన ప్రార్థనామందిరాలు
– అలరించిన సామూహిక గీతాలాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను శనివార తాండూరులో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే క్రైస్తవుల ఇళ్లలో పండగ వాతావరణం కనిపించింది. తాండూరులోని అన్ని చర్చీలను క్రిస్మస్ వేడుకల సందర్భంగా ముస్తాబు చేశారు. గత రెండు రోజులుగా చర్చీలు విద్యుత్ దీపాల అలంకరణతో వెలిగిపోతున్నాయి. ఇక క్రైస్తవుల ఇళ్ల వద్ద క్రిస్మస్ చెట్టు, నక్షత్రంను వేలాడదీశారు. పండగ సందర్భంగా చర్చీలకు క్రైస్తవుల తాకిడి కనిపించింది. అన్ని చర్చీలలో ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు జరిగాయి. క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో ఈ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.
కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్ ప్రార్థనలకు వచ్చారు. ముఖ్యంగా తాండూరులోని మార్వాడీబజార్లోని మెథడిస్ట్ చర్చి క్రిస్మస్ వేడుకల సందర్భంగా కిక్కిరిసి కనిపించింది. అందరూ కలిసి ఏసును భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు చేశారు. అనంతరం నిర్వహించిన క్రిస్మస్ గీతాలాపన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ప్రార్థనల అనంతరం అన్ని చర్చిలతో గీతాలను ఆలపించారు. సామూహికంగా గీతాలను ఆలపించి క్రిస్మస్ పండగను మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు. తాండూరులోని దాదాపుగా అన్ని చర్చీల వద్ద క్రైస్తవులు కంటుంబ సభ్యులతో వచ్చి వేడుకలు జరుపుకున్నారు. తాండూరు పట్టణ సమీపం రాజీవ్ కాలనీలోని నజరేతు చెర్చిలో క్రిస్మస్ వ డుకలు అట్టహాసంగా జరిగాయి. క్రైస్తవ మహిళలు సైతం భారీ సంఖ్యలో చర్చీలకు తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. చర్చీలలో ప్రార్థనల అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు చర్చీల వద్దకు వచ్చి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
