రాజ్యాధికారం దిశగా కాంగ్రెస్
– రేవంత్ ఆధ్వర్యంలో దూసుకెళ్తున్న హస్తం
– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాదం సతీష్,
ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం దిశగా దూసుకెళుతోందని ఆ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాదం సతీష్ అన్నారు. శుక్రవారం రాజీవ్ గాంధీ 77 వ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరులో యూత్ కాంగ్రెస్ మరియు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాదం సతీష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్‌లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఉత్తేజంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు వెళ్తుందన్నారు.

రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం దిశగా పయనిస్తుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధువు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని తాండూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తాండూర్ స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తక్షణమే రాజీనామ చేయాలన్నారు. ఆయన రాజీనామా చేస్తే మళ్లీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


