గుట్కా అమ్మకాల గుట్టు రట్టు
– టాస్క్‌ఫోర్స్, పోలీసుల సంయుక్త తనిఖీలు
– రూ. 32 వేల ప్యాకెట్ల స్వాధీనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: గుట్టుగా అమ్మకాలు చేపడుతున్న గుట్కా ప్యాకెట్ల గుట్టును వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్, యాలాల పోలీసులు రట్టు చేశారు. సంయుక్తంగా జరిపిన తనిఖీలలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, యాలాల ఎస్ఐ శంకర్‌లతో కలిసి మండలంలో గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించారు. మండలంలోని లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తాలో ఉన్న షాపులలో తనిఖీలు చేపట్టారు.
తనిఖీలలో స్థానికంగా ఉన్న శ్రీకాంత్ కిరాణ జనరల్ స్టోర్, అరవింద్ కిరాణా జనరల్ స్టోర్ అనే రెండు దుకాణాలలో సోదాలు నిర్వహించగా భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. మొత్తం 15261 ప్యాకెట్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలుల దాదాపు రూ. 33 వేల 204లు ఉంటుందని పోలీసులు అధికారులు అంచనా వేశారు. మరోవైపు గుట్టుగా గుట్కా విక్రయాలకు పాల్పడుతున్న దుకాణాల యజమానుల వివరాలను నమోదు చేసుకున్నారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యాపారులపై ఈమేరకు కేసు నమోదు చేసినట్లు యాలాల ఎస్ఐ శంకర్ తెలిపారు. మరోవైపు ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

