స్మార్ట్‌గా జ‌న‌గ‌ణ‌న‌..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

స్మార్ట్‌గా జ‌న‌గ‌ణ‌న‌..!
– తొలిసారిగా సాంకేతిక‌త వినియోగం
– వ‌చ్చే వేస‌విలో చేప‌ట్టేందుకు క‌స‌ర‌త్తు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌దేళ్ల‌కోసారి చేప‌ట్టే జ‌న‌గ‌ణ‌న‌ను ప‌క‌డ్బందీగా చేప‌ట్టేందుకు కేంద్రం స‌న్న‌ద్ద‌మ‌య్యింది. ఈ సారి తొలిసారిగా అందించిన సాంకేతిక‌త‌ను వినియోగించుకునేందుకు దృష్టిసారించింది. వ‌చ్చే వేసవిలో జ‌న గ‌ణ‌ను చేప‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తును ప్రారంభించింది. మ‌న‌దేశంలో ప్ర‌తి ప‌దేళ్ల‌కోసారి జ‌న‌గ‌ణ‌న నిర్వ‌హిస్తారు. ముందుగా జిల్లాలు, గ్రామాలు, కుటుంబాల వివ‌రాలు సేక‌రించిన త‌రువాత ప్ర‌జ‌ల వ్య‌క్తిగత వివ‌రాల‌ను న‌మోదు చేయ‌డం ఆన‌వాయితీ. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2011లో జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టారు. తెలంగాణ‌లో ఏడేళ్ల‌యినా జ‌న‌గ‌ణన జ‌ర‌గ‌లేదు. వాస్త‌వానికి 2020లోనే జ‌న‌గ‌ణ‌న నిర్వ‌హించాల్సింది. అదే స‌మ‌యంలో క‌రోనా మొద‌టి ద‌శ‌లో వాయిదా ప‌డింది. త‌గ్గుముఖం త‌రువాత మ‌ళ్లీ ప్రారంభించాల‌ని య‌త్నించిన కోవిడ్ సెంకండ్ వేవ్‌తో మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఇలా జ‌న‌గ‌ణ‌న వాయిదా ప‌డ‌డం ఇదే తొలిసార‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్ పోర్ట‌ల్‌కు క‌స‌ర‌త్తు
ఈ సారి నిర్వ‌హించే జ‌న‌గ‌ణ‌న‌కు తొలిసారి సాంకేతిక‌త‌ను వినియోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక కొత్త జిల్లాలు, కొత్త మండ‌లాలు, కొత్త గ్రామ‌పంచాయ‌తీలు, మున్సిప‌ల్‌ల ఏర్పాటుతో పాటు కొత్త‌గా కాల‌నీలు వీలీన‌మైన విష‌యం తెలిసిందే. ఇలాంగి వివ‌రాల‌ను భౌగోళికంగా గుర్తించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. క్షేత్ర‌స్థాయిలో న‌మోదుకు వ‌చ్చే ఎన్యూమ‌రేట‌ర్లు ఓ వైపు ప్ర‌భుత్వం అంద‌జేసే టాబ్‌ల‌తో పాటు ప‌త్రాలపై ఒకేసారి న‌మోదు చేయ‌నున్నారు. న‌మోదు చేసిన వివ‌రాల‌ను ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో పొందుప‌ర‌చ‌నున్నారు.

పంచాయ‌తీలు, మున్సిప‌ల్‌ల‌లో హ‌ద్దుల నిర్దార‌ణ
ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న జ‌న‌గ‌ణ‌ను రెండు ద‌శ‌ల్లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇంత‌కుముందు చెప్పిన‌ట్లుగా కొత్త జిల్లాలు, మండ‌లాలు, పంచాయ‌తీలు, మున్సిప‌ల్‌ల‌ను ముందుగా గుర్తించి ఆ త‌రువాత జ‌నాభాను లెక్కించ‌బోతున్నారు. దీంతో కొత్త‌గా ఏర్పాటైన పంచాయ‌తీలు, మున్సిప‌ల్ స‌రిహ‌ద్దుల నిర్దారించ‌డం జ‌రుగుతుంది. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో ఫాం-1, మ‌న్సిప‌ల్ ప్రాంతాల్లో ఫాం-2లను వినియోగించ‌బోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామంగా, ప‌ట్ట‌ణాల్లో వార్డుల‌ను యూనిట్‌గా తీసుకుని స‌ర్వే చేయ‌బోతున్నారు.

త్వరలో ఎన్యూమ‌రేట‌ర్ల‌కు శిక్ష‌ణ
జ‌న‌గ‌ణ‌న కోసం కేంద్రం ఉపాధ్యాయుల‌ను ఎన్యూమ‌ట‌ర్లుగా నియ‌మించ‌నుంది. గ్రామీణం, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని 150-180 గృహాల‌ను, 800ల జ‌నాభాను ఒక బ్లాక్‌గా గుర్తించి వారికి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్నారు. జ‌న‌గ‌ణ‌న‌ను ప‌క‌డ్బందీగా చేప‌ట్టేందుకు త్వ‌ర‌లోనే ఎన్యూమ‌రేట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించే ఉపాధ్యాయులకు శిక్ష‌ణ ఇవ్వ‌బోతున్నారు.