వడ్డీ వ్యాపారులపై ప్రత్యేక నిఘా..!
– అధిక వడ్డీలకు వేధిస్తే చర్యలు తప్పవు
– వికారాబాద్ జిల్లా ఎస్‌పి శ్రీ. ఎన్. కోటి రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వడ్డీ వ్యాపారులు, చిట్టీల వ్యాపారులు, రోజువారీ కలెక్షన్ నిర్వహించే వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయదారులు,చిరు వ్యాపారస్తులు ఉన్నారని, దీనిని అదునుగా తీసుకోని కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీ వసూలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని దృష్టికి వచ్చాయన్నారు. వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తులు అధిక వడ్డీ కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టాలని, వేధింపులకు పాల్పడిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తప్పక తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని పేర్కొ్నారు. ప్రజలకు ఇబ్బంది కల్గించిన వ్యక్తులను ఉపేక్షించే వీల్లేదని అన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే డయల్ 100కు కాల్ చేయొచ్చన్నారు. ఇప్పటికైనా వడ్డీ వ్యాపారులు వారి స్వభావాన్ని మార్చుకోవాలని సూచించారు.

