ఊరూరా నిఘా వ్యవస్థ..!
– సీసీ కెమరాల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి
-వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– అంతారంలో సీసీ కెమరాలను ప్రారంభించిన ఎస్పీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని ప్రతి గ్రామంలో నిఘా వ్యవస్థ ఏర్పాటయ్యేలా ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధి, తాండూరు మండలం అంతారం గ్రామంలో పంచాయతి నిధుల నుంచి 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గురువారం వికారాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నేరాలను అదుపు చేసేందుకు నిఘానేత్రాలు దోహదపడతాయన్నారు. ఎవ్వరు ఎక్కడ గొడవలు పడినా, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడం జరుగుతుందని అన్నారు. దీంతో నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.

త్వరలోనే అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు దృష్టిసారిస్తామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎవ్వరు గంజాయి సాగు చేయొద్దన్నారు. గంజాయిని సాగుచేస్తే చట్టపరమైన చర్యలతో పాటు ప్రభుత్వ పథకాలపై కూడ చర్యలు తప్పవన్నారు. కావున గంజాయి సాగును తరిమేయాలని అన్నారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి ఎన్సీసీ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

