సీఎం కేసీఆర్‌వి దయ్యాల వేదాలు
– కాంగ్రెస్ వాళ్లను కొన్నప్పుడు ఆత్మగౌరవం ఏమైంది
– చిత్తశుద్ది ఉంటే వారితో రాజీనామా చేయించాలి
– టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో నలుగురు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆకాశానికి ఎత్తివేయడం దయ్యాలు వేదాలు చదువుతున్నట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు ఇంచార్జ్ ఎం.రమేష్ మహరాజ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో ఉన్న ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డితో పాటు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన హీరోలు అంటూ ఆకాశానికి ఎత్తిన తీరును ఆదివారం టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ ఓ ప్రకటనలో ఖండించారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫాంపై గెలిచిన 12 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు.. అందులో ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఏమందని.. మీ చిత్తశుద్ది ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అప్పట్లో రూ. 30 కోట్లకు అమ్ముడు పోయిన వాళ్లు అయినందుకే ఇప్పుడు ఢిల్లీ వాళ్లు రూ. 100 కోట్లకు కొనాలని చూశారేమో.. అని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లు ఆత్మగౌరవ హీరోలు అంటూ సీఎం కేసీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు చదువుతున్నట్లుగా ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాడాలనే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేర్పించుకున్న 12 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, మళ్లీ ఎన్నికలకు వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ అభివృద్ధిలో చివర.. వివాదాలలో మొదటి స్థానంలో ఉన్నారని విమర్శించారు.

