ప్రతి నర్సరీ పచ్చదనంతో కళకళలాడాలి

తాండూరు వికారాబాద్

ప్రతి నర్సరీ పచ్చదనంతో కళకళలాడాలి
– మొక్క‌ల పెంప‌కంపై నిర్ల‌క్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు
– గ్రామాల్లో 50శాతం త‌గ్గ‌కుండా ఉపాధి ప‌నులు
– స‌మీక్ష‌లో వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలోని ప్ర‌తి న‌ర్స‌రీ ప‌చ్చ‌ద‌నంతో ప‌రుఢ‌విల్లాల‌ని, ఇందులో నిర్ల‌క్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేద‌ని వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల సూచించారు. శుక్రవారం వికారాబాద్‌లోని డీఆర్పీసీ భ‌వనములో హరితహారం నర్సరీల నిర్వహణ, వైకుంఠ దామలు, కళ్లాల నిర్మాణపు పనులపై ఆయా శాఖల అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న హ‌రిత‌హారం 8వ విడతలో భాగంగా నర్సరీల ద్వారా అవసరమైన నాణ్యమైన మొక్కలు అందించేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు మొలకలు మొలకేత్తక పోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం రోజులలో మొలకేత్తని మొక్క‌ల స్థానంలో వేరేవి తెప్పించి నాటాలన్నారు. ముఖ్యంగా యాలాల, నవాబుపేట మండలాల ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తక్కువ సమయంలో వేగవంతంగా పెరిగే గుల్మొహర్, టెకోమా, మునగ మొక్కలను నాటాలన్నారు. ప్రతి నర్సరీ పచ్చదనంతో కళకళలాడాలని అన్నారు. ఇట్టి పనులను ఎంపీడీఓల పర్యవేక్షణలో జరగాలని తెలిపారు.

క‌ల్లాల‌పై అసంతృప్తి

క‌ల్లాల నిర్మాణ ప‌నుల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు అనుకున్నంతగా కల్లాల నిర్మాణపు పనులు చేపట్టకపోవడంపై కలెక్టర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వారం రోజులలో ఔత్సాహకులైన రైతులను గుర్తించి గ్రౌండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. దీంతో పాటు అసంపూర్తిగా ఉన్న వైకుంఠదామల నిర్మాణపు పనులను వారం రోజులలో పూర్తి చేసి సంబంధిత కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లెంచేందుకు గాను వెంటనే FTO లు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. గ్రామాలకు మంజూరైన సీసీ రోడ్ల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని తెలిపారు. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు 50 శాతానికి తగ్గకుండ చూడాలని సూచించారు. ఇక నుండి సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, చేపట్టే పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్బంగా అధికారులను హెచ్చరించారు.

ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డిఆర్డిఓ కృష్ణన్, పంచాయతీ రాజ్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీఓలు, ఎంపీవోలు, పిఆర్ ఇఇ లు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.