ఆర్బీఎల్ ఫ్యాక్టరీ కాలుష్యంపై చర్యలు తీసుకోండి
– జిల్లా కలెక్టర్‌కు యాలాల యూత్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం జక్కెపల్లి గ్రామ సమీపంలోని ఆర్బీఎల్(రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్) ఫ్యాక్టరీ కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఈ ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజుల మన్నన్, నాయకులు మాట్లాడుతూ జక్కెపల్లి సమీపంలోని ఆర్బీఎల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం జరుగుతుందని ఆరోపించారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలైన జక్కెపల్లి, ముకుందాపూర్, బెన్నూర్, సంగంఖుర్దు గ్రామాలతో పాటు కాలుష్యం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఫ్యాక్టరీ వ్యర్థాలు కాగ్నావాగుతో పాటు కాలువల్లో కలిసి నీరు కలుషితమవుతుందన్నారు. పశువులు కలుషిత నీటిని సేవించడం వల్ల మృత్యువాత పడుతున్నాయన్నారు. కాగ్నా నదిలో నీటి కాలుష్యం చేరి తాండూరు పట్టణ వాసులను కూడ అనారోగ్యం పాలు చేస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. కావున ఆర్బీఎల్ ఫ్యాక్టరీ కాలుష్యంపై చర్యలు తీసుకుని పశువులకు, మనషులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

