కౌన్సిల‌ర్ గురించి అస‌భ్యంగా మాట్లాడుతున్న ఆర్పీలు

తాండూరు రాజకీయం వికారాబాద్

కౌన్సిల‌ర్ గురించి అస‌భ్యంగా మాట్లాడుతున్న ఆర్పీలు
– కాన్ఫ‌రెన్స్‌లో రికార్డ‌యిన మాట‌లు
– ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: స‌మాజంలో బాధ్య‌త ప‌ద‌విలో ఉన్న ఓ కౌన్సిల‌ర్ గురించి మున్సిప‌ల్ ఆర్పీలు అస‌భ్యంగా మాట్లాడుకున్నారు. అనుకోకుండా ముగ్గురి కాల్స్ కాన్ఫ‌రెన్స్‌లోకి వెళ్ల‌డంతో బాధిత కౌన్సిల‌ర్ వారి మాట‌ల‌ను రికార్డు చేశారు. ఈ సంఘ‌ట‌న శ‌నివారం తాండూరు మున్సిప‌ల్‌లో వెలుగులోకి వ‌చ్చింది. బాధిత కౌన్సిల‌ర్ అధికారుల‌కు ఫిర్యాదు చేసిన విన‌తిప‌త్రం వివ‌రాల ప్ర‌కారం.. తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని 14వ వార్డు కౌన్సిల‌ర్‌గా బొంబీనా(ఎంఐఎం పార్టీ) కొన‌సాగుతున్నారు. ఇటీవ‌లే ఆమె త‌న వార్డులో ప‌ర్య‌టించారు. పాతీమా మ‌జీద్ ప్రాంతంలో ఓ వీధి వ్యాపారి గ‌తంలో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా రుణం మంజూర‌య్యింది. రుణం మంజూరు అయినందుకు వార్డు ఆర్పీ క‌ళ్యాణీకి రూ. 400లు ఇచ్చిన‌ట్లు కౌన్సిల‌ర్ బొంబీనాకు తెలిపారు. దీంతో కౌన్సిల‌ర్ బొంబీనా వ్యాపారి నుంచి డ‌బ్బులు ఎందుకు తీసుకున్నార‌ని ఆర్పీ క‌ళ్యాణికి ఫోన్ చేసి అడిగారు. డ‌బ్బులు తాను తీసుకోలేద‌ని 15వ వార్డుకు చెందిన మ‌రో ఆర్పీ శ‌శిక‌ళ తీసుకుంద‌ని బ‌దులిచ్చింది. అదే స‌మ‌యంలో క‌ళ్యాణికి శ‌శిక‌ళ ఫోన్ చేయ‌డంతో కౌన్సిల‌ర్ బొంబీనా కాల్‌, క‌ళ్యాణి, శ‌శిక‌ళ కాల్స్ కాన్ఫ‌రెన్స్‌లోకి వెళ్లాయి. ఇది తెలియ‌ని ఆర్పీలు కౌన్సిల‌ర్ బొంబీనా గురించి మాట్లాడుకున్నారు. డ‌బ్బులు తీసుకున్నందుకు ఏం చేసుకుంటుందో చేసుకోమ‌ని, అంత‌టితో ఆగ‌కుండా బూతులు కూడ మాట్లాడుకున్నారు. ఈ మాట‌ల‌న్నింటిని కౌన్సిల‌ర్ బొంబీనా రికార్డు చేసుకున్నారు.
ఈ మేర‌కు శ‌నివారం తాండూరు మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్‌ను క‌లిసి ఆర్పీల‌పై ఫిర్యాదుచేశారు. త‌న గురించి అస‌భ్యంగా మాట్లాడుకున్నార‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఎంసీ ర‌వికుమార్, టీఎంసీ వెంక‌ట్‌ల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో పాటు ఇద్ద‌రి ఆర్పీల‌ను విధుల్లో నుంచి తొల‌గించాల‌ని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.