అమ్మో అంతర్ రాష్ట్ర దొంగ‌..!

క్రైం జాతీయం తాండూరు వికారాబాద్

అమ్మో అంతర్ రాష్ట్ర దొంగ‌..!
– 60 ఏండ్ల‌లో కూడ చోరీలు
– పాత కేసులో రిమాండ్ చేసిన తాండూరు పోలీసులు
– వివ‌రాలు వెల్ల‌డించిన ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్ర‌తినిధి : ప‌గ‌లంతా డ్రైవ‌ర్.. రాత్రయితే కేటుగాడు. డ్రైవింగ్ ప‌నిమీద వెళ్లిన ప్రాంతంలో చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తాడు. చిటికెలో చోరీలు చేసి జారుకుంటాడు. ఇంత హ‌స్త‌క‌ళ‌ను ప్ర‌ద‌ర్శించేది ప‌డుచువాడు అనుకుంటే పొర‌ప‌డ్డే. ఇదంతా చేసేది అచ్చంగా 60 ఏండ్ల వృద్దుడు అంటే న‌మ్ముతారా. అవునండి మీరు చ‌దివింది నిజ‌మే. కావాలంటే తాండూరు ప‌ట్ట‌ణ పోలీసుల మాట‌ల్లోనే చ‌ద‌వండి. ఈ కేసుకు సంబంధించి ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 2021 న‌వంబ‌ర్ 15వ తేది రాత్రి 2 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫ్లైఓవ‌ర్ స‌మీపంలో ఉన్న ఓ హ‌ర్డ్ వేర్ షాపు సెట‌ర్స్‌ని బ్రేక్ చేసి రూ. 3 ల‌క్ష‌ల 50 వేల‌ను దొంగ‌త‌నం చేశాడు. అప్ప‌ట్లో పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. షాపులో ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా నిందితుని చిత్రాల‌ను తీసుకున్నారు. వివిధ ప్రాంతాల‌లో విచార‌ణ ముమ్మ‌రం చేశారు. నిందితుని వివ‌రాల‌ను తీసుకుని కర్ణాటక రాష్ట్రంలోని ప‌లు పోలీస్టేష‌న్ల‌లో కూడ విచార‌ణ జ‌రిపారు. ఈ క్ర‌మంలో గుల్బర్గా జిల్లా షాబాద్ పోలీస్టేష‌న్ ప‌రిధి చిత్తాపూర్ సమీపంలోని అంగ్గోటా గ్రామానికి చెందిన 65 ఏండ్ల మస్తాన్ షా ఫై అనుమానం పెరిగింది. లోతుగా విచార‌ణ చేస్తే డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ చోరీల‌కు పాల్ప‌డుతుంటాడ‌ని తేలింది. తాండూరు పోలీసులు వెంట‌నే నిందితున్ని అదుపులోకి తీసుకుని తాండూరు పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. పోలీసులు చేసిన విచార‌ణ‌లో నిందితుడు నేరాన్ని అంగీక‌రించడంతో అరెస్టు చేసి అంత‌ర్ రాష్ట్ర దొంగ‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ట్టణ ఎస్ఐ అబ్దుల్ ర‌వూఫ్‌, సిబ్బంది ఉన్నారు.