కల్తీకి పాల్పడితే పీడీ యాక్టు..!
– ప్రజలను మోసం చేస్తే చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– కోడంగల్‌లో రూ. 5లక్షల కల్తీ టీ పౌడర్, గుట్కా స్వాధీనం
కోడంగల్, దర్శిని ప్రతినిధి: ఆహార పదార్థాలు, పానీయాలు, ఇతర వస్తువులలో పాల్పడితే వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాలోని కోడంగల్ ప్రాంతంలో గుట్టుగా సాగిస్తున్న కల్తీ టీ పౌడర్, గుట్కా ప్యాకెట్ల విక్రయాల గుట్టును టాస్క్ ఫోర్స్ బృందం, స్థానిక పోలీసులు రట్టుచేశారు. జిల్లా ఎస్సీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు దాడులు చేపట్టిన పోలీసులు దాదాపు రూ. 5 లక్షల విలువైన కల్తీ టీ పౌడర్, నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం కోడంగల్ పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై వివరాలను వెల్లడించారు. టాస్క్ ఫోర్స్, పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో కోడంగల్ మండల పరిధిలోని రావుల్ పల్లి గ్రామానికి చెందిన కాశీనాథ్, మేఘరాజ్, లక్ష్మీకాంత్ ల కిరణా దుకాణాలతోపాటు టీ హోటళ్లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీల్లో 20 క్వింటాళ్ల కల్తీ టీ పౌడర్, నిషేధిత గుట్కా ప్యాకెట్లను లభ్యమైనట్లు వెల్లడించారు. వీటి విలువ దాదాపు రూ. 5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఇటీవల పరిగి నియోజకవర్గం కుల్కచెర్లలో కల్తీ వ్యవహారం వెలుగులోకి రావడంతో టాస్క్ ఫోర్స్, పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ఈ దాడుల్లో పట్టుబడిన కల్తీ టీ పౌడర్ సరఫరాపై ఆరా తీయగా కోస్గి మండలం సంపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ హైదరాబాద్ నుంచి కల్తీ టీ పౌడర్ ను తీసుకవచ్చి విక్రయాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. అదేవిధంగా జిల్లాలో కల్తీ వ్యాపారంతో పాటు నిషేధిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. దుకాణాలు, హోటళ్లలో ఆహార పదార్థాలు, వస్తువులలో ఎవరైనా కల్తీ వ్యాపారానికి పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు తనిఖీలో చాకచక్యంగా వ్యహరించిన సిబ్బందికి త్వరలోనే పోలీసు శాఖ తరుపున రివార్డులు అందిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఎం. అప్పయ్య, నాగేశ్వర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

