కార్మికుల కడుపు కొట్టొద్దు..!
– హైకోర్టు ఎజెండాలోని కార్మికుల అంశాన్ని వెనక్కితీసుకోవాలి
– నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వేతనాలు చెల్లించకుండా కార్మికుల కడుపుకొట్టొద్దని ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ పండింత్ అన్నారు. మూడు నెలలుగా వేతనాలు అందక పోవడంతో ఏఐటీయూసీ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. గురువారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి పాత తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందున్న రోడ్డుపై బైటాయించారు. పెండింగ్ జీతాలతో పాటు పెంచిన వేతనాలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ పండిత్ హాజరై మద్దతు తెలిపారు. కార్మికులతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి, మున్సిపల్ పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ వర్గాలతో పేరుతో కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం విడ్డూరమని విమర్శించారు. పాలకవర్గాల వర్గాల పేరుతో కార్మికులు నలిగిపోతున్నారన్నారు. మూడు, నాలుగు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఉపవాసాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు గోపాల్ మాట్లాడుతూ హైకోర్టులో ఉన్న ఎజెండాలో కార్మికుల అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలను చెల్లించి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. లేదంటే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

