వడ్లు కొనేదాకా కేంద్రంపై పోరాటం

తాండూరు రాజకీయం వికారాబాద్

వడ్లు కొనేదాకా కేంద్రంపై పోరాటం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– మండ‌లంలో న‌ల్ల‌జెండాల‌ను ఎగుర‌వేసిన ఎమ్మెల్సీ
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : రైతులు పండించే వడ్లు కొనుగోలు చేసేదాక కేంద్రంపై పోరాటం ఆగదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం తాండూరు మండలంలోని చెన్‌గెష్ పూర్, కొనాపూర్ గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన నిరసనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై గ్రామంలోని ఇంటింటిపైనా నల్ల జెండాను ఎగురవేసి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులు, పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా మోసం చేస్తుందని అన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం చేస్తున్నారని అన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనేదాకా కేంద్రంపై పోరాటం ఆగదన్నారు. పంజాబ్ తరహాలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణంపురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, నాయకులు శ్రీశైలం, రాజు, సర్పంచ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.