పల్లె సంగ్రామం..!
– ఖాళీగా ఏర్పడ్డ స్థానాలకు ఉప పోరు
– ఎన్నిలకు కసరత్తు చేస్తున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పల్లె సంగ్రామం మొదలు కాబోతుంది. గ్రామాల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉప పోరు జరగబోతుంది. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. తాండూరు నియోజకవర్గంలో కొంత మంది సర్పంచులు, ఎంపీటీసీలు మృతి చెందడంతో పాటు రాజీనామాలు చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. యాలాల మండలం తిమ్మాయిపల్లి, రాళ్లగడ్డ తాండా, పెద్దేముల్ మండలం మారేపల్లి తాండా, బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు తదితర స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఓటరు ముసాయిదా జాబితాను సిద్దం చేశారు. ఎన్నికలు నిర్వహించనున్న పంచాయితీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. 16 వ తేది వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 19న తప్పుల సవరణ, 21న తుది జాబితాను ప్రకటించనున్నారు. తదనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. అంతకుముందు జిల్లా స్థాయి, మండల స్థాయి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 12, 13న ఈ సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

