వ్యాధులపై అప్రమత్తం
– కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
– నిర్లక్షం చేస్తే చర్యలు తప్పవన్న సీఎం కేసీఆర్
దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో విష జ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. కరోనానో.. డెంగ్యూనో అని తెలియక భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రులకు వచ్చిన ప్రతీఒక్కరి అనుమానం పోయేలా వివరాలు చెప్పాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పలు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా విష జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విషజ్వరాలపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. దీనివల్ల కేవలం వైరల్ ఫీవర్ల నుంచే కాకుండా కరోనా నుంచి కూడా ప్రజలు రక్షణ పొందుతారని వివరించారు. ఇప్పటికే గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేశామని, వీటి వినియోగం పైనా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా పారిశుద్ధ్య పనులును పరిశీలించాలని, తమతమ గ్రామాల ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
