వర్గపోరులతో దొంగాటలు

తాండూరు రాజకీయం వికారాబాద్

వర్గపోరులతో దొంగాటలు
– పబ్బపు రాజకీయాలతో లబ్ది
– అభివృద్ధిని దూరం చేస్తున్న నాయకులు
– అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు వర్గపోరులతో దొంగాటలు ఆడుతున్నారని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ విమర్శించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ వర్గాల పోరుతో తాండూరు అభివృద్ధికి దూరమయ్యిందని ఆవేధన వ్యక్తం చేశారు. శనివారం తాండూరు పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యు.రమేష్ కుమార్ మాట్లాడారు. జాతర ఉత్సవాల నేపథ్యంలో ఎమ్మెల్సీ నుహేందర్ రెడ్డి పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిని దూషించడాన్ని ఖండించారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే వర్గీయులు చౌరస్తాలో ఆందోళన నిర్వహించడం, ఇందులో బీసీ సామాజిక యువకుడు అశోక్ ముదిరాజ్ పై దాడి చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గపోరుతో దొంగాట ఆడుతున్నారని కేంద్రం వైఖరిలో దోస్తీ చేస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో ఖుస్తీ పడుతున్నారని విమర్శించారు. ప‌బ్బ‌పు రాజ‌కీయాల‌తో ల‌బ్దిపొందుతున్నార‌ని, వ‌ర్గ‌పోరు అంతా బూట‌క‌మ‌ని అన్నారు. దీనిపై నష్టపోయేది వారి వెనుకాల ఉన్న అనుచరులేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రోడ్డుకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయడం, పనులు ఇంకా ప్రారంభించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఇసుక, సుద్ద అక్రమ రవాణాలు, కబ్జాలపై తొత్తులను వెనుకేసుకు వస్తున్నారని ఆరోపించారు. తాండూరు సీఐ వ్యవహారంలో జిల్లా ఎస్పీ స్పందించకపోవడంపై ప్రశ్నించారు. పోలీసులు, ఇతర విభాగాల అధికారులు నాయకులకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రజా రాజకీయాల్లోకి వస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పనిచేసి అధికారం చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మహిళ మార్చ రాష్ట్ర నాయకురాలు, కౌన్సిలర్ అంతారం లలిత, తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ హన్మంతు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు బంటారం భద్రేశ్వర్, సీనియర్ నాయకులు పూజారీ పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, యాలాల ఇంచార్జ్ రజనీకాంత్, అధ్యక్షులు మహిపాల్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, బీజె వైఎం జిల్లా నాయకులు అంతారం కిరణ్, తాండూరు నాయకులు శ్రీకాంత్ రెడ్డి, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.