రెండు నిమిషాలు లేట్.. ముగ్గురు ఔట్..!
– ముగ్గురు విద్యార్థులు పరీక్షకు దూరం
– నిమిషం నిబంధనతో అనుమతించని యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన వల్ల విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. తాండూరులోని రెండు పరీక్షా కేంద్రాలలో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో యజమాన్యం పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు విషన్న వదనాలతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు ముస్లిం విద్యార్థులకు పట్టణంలోని సింధు బాలికల జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రం పడింది. అదే కాలేజీకి మరో విద్యార్థినికి పట్టణంలోని సిద్దార్థ జూనియర్ కళాశాలలో సెంటర్ పడింది. మొదటి ఇద్దరు విద్యార్థులు కోట్‌పల్లి మండలం నుంచి ఆర్టీసీ బస్సులో తాండూరుకు వచ్చారు. పరీక్షా కేంద్రానికి చేరుకునేలోపే రెండు నిమిషాలు ఆలస్యం అయ్యింది. కేంద్రం గేటు వద్ద నిలబడి నిర్వహకులను బతిమాలిన కనికరించలేదు. మరో విద్యార్థిని తాండూరు మండలం అంతాంరం నుంచి కుటుంబీకులకు చెందిన బైక్‌పై సిద్దార్థ కళాశాలకు బయల్దేరింది. మార్గమద్యలో బైక్ మొరాయించింది. దీంతో నిర్ణీత సమయం దాటి పరీక్షా కేంద్రానికి చేరుకుంది. ఆలస్యం కావడంతో సెంటర్ నిర్వహకులు లోపలికి అనుమతించలేదు. చేసేదేమి లేక ఆమె కూడ ఇంటికి తిరిగి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

