పాపం.. నర్సమ్మ..!
– ఫించన్ తీసుకుని ఇంటికెళ్లేలోపే ఘోరం
– పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పండు ముసలమ్మ.. ఫించన్ డబ్బులు తీసుకుని ఆనందంగా ఇంటికి వెళుతోంది. కొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకోబోతుండగా ఆ వృద్ధురాలును మృత్యువు వెంటాడింది. పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యింది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాత తాండూరులోని హనుమాన్ గల్లికి చెందిన నర్సమ్మ వృద్దురాలు(64) శుక్రవారం ఫించన్ డబ్బులు తీసుకునేందుకు బయటకు వచ్చింది.
పట్టణంలోని రైల్వే గేటు వద్ద నుంచి వస్తుండగా పట్టాలు దాటే క్రమంలో ఓ గూడ్స్ రైలు ఢికొనడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే వృద్దురాలుకు చెవుడుతో పాటు కంటిచూపు లోపం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కొద్ది సేపట్లోనే ఇంటికి చేరుకునేలోపు రైలు ఢీకొని మృతి చెందడంతో పాపం నర్సమ్మ అంటూ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంభీకులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురుకి తరలించారు.
ఇదికూడా చదవండి…

