చుట్టపు చూపు షో వ‌ద్దు

జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

చుట్టపు చూపు షో వ‌ద్దు
– తెలంగాణ‌కు ఇచ్చిన హామిల‌ను నెర‌వేర్చాలి
– అమిత్‌షాపై మంత్రి స‌బితారెడ్డి మండిపాటు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రాని విచ్చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చుట్టపు షోలు చెయొద్ద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. శుక్ర‌వారం టీఆర్ఎస్ ఎల్పీలో స‌బితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న‌పై మండిపాటును వ్య‌క్తం చేశారు. చుట్టపు చూపులా.. టూరిస్టులా తెలంగ‌ణకు వ‌చ్చి పోతామంటే కుద‌ర‌దు అని అమిత్ షా ప‌ర్య‌ట‌నను ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ‌కు కేంద్రం ఇచ్చిన హామిల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ప్ర‌క‌టించాల‌ని, విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల‌ని స‌బిత డిమాండ్ చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాల‌ని, ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ, రైల్వే కోచ్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌టన చేయాల‌ని ధ్వ‌జ‌మెత్తారు. అదేవిధంగా పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ను పూర్తి చేసి పాల‌మూరు ప్ర‌జ‌ల‌కు సాగునీరు అందిద్దామ‌ని సీఎం కేసీఆర్ సంక‌ల్పిస్తే.. దానికి బీజేపీ నేత‌లు అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని, కృష్ణా న‌దిలో తెలంగాణ‌కు రావాల్సిన వాటా గురించి కేంద్ర ప్ర‌భుత్వానికి సీఎం కేసీఆర్ అనేక సార్లు మొర పెట్టుకున్నార‌న్నారు. కానీ అటునుంచి ఎలాంటి స్పంద‌న లేదని, దీనిపై కూడా అమిత్ షా స్పందించాల‌న్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని ప‌టిష్టం చేస్తున్నార‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేశామ‌న్నారు. తెలంగాణ‌కు విద్యా సంస్థ‌ల‌ను కేటాయించ‌కుండా ఇక్క‌డి విద్యార్థుల‌ను కేంద్రం విస్మ‌రిస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఐఐఎంలు, ఐఐటీలు కేటాయించ‌లేదు. ట్రిపుల్ ఐటీలు కూడా ఇవ్వ‌లేదు. మెడిక‌ల్ కాలేజీల విష‌యంలోనూ కేంద్రం వివ‌క్ష ప్ర‌ద‌ర్శించింద‌ని మంత్రి నిప్పులు చెరిగారు. మ‌రోవైపు రాష్ట్రంలో గ్యాస్ ధ‌ర‌లు, డీజిల్, పెట్రోల్ ధ‌ర‌ల‌తో పాటు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌రలు కూడా పెంచి ప్ర‌జ‌ల‌పై పెనుభారం మోపింద‌ని మండిప‌డ్డారు.