మంకీపాక్స్‌పై తెలంగాణ‌ అలర్ట్‌..!

ఆరోగ్యం తెలంగాణ హైదరాబాద్

మంకీపాక్స్‌పై తెలంగాణ‌ అలర్ట్‌..!
– ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆసుప‌త్రుల‌కు వెళ్లాల‌ని సూచ‌న‌
– ప‌రీక్ష‌లు, చికిత్స‌పై డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు
హైదరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : క‌రోనా వైర‌స్ త‌రువాత ప‌లు దేశాల‌ను మంకీపాక్స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. దాదాపు 12 దేశాల్లో మంకీపాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. దీంతో ఈ మ‌హ‌మ్మారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అల‌ర్ట్ అయ్యింది. రాష్ట్రంలోకి వ్యాధి ప్ర‌వేశం, నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్‌వో) అప్రమత్తం చేస్తూ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. మంకీపాక్స్‌ లక్షణాలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అన్ని దవాఖానల్లో చికిత్సకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి, వ‌స్తున్న వారి నుంచి మంకీపాక్స్ వ్యాప్తికి అవ‌కాశం ఉంద‌ని అనుమానిస్తున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో వ్యాధిని క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

మంకీపాక్స్‌ లక్షణాలు, చికిత్స‌
ఈ మ‌హ‌మ్మారి సోకిన వారిలో జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం జ‌రుగుతాయి. అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్‌ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారిలో ఈ ల‌క్ష‌ణాలు వెలుగులోకి వ‌స్తాయి. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే దవాఖానలో చేర్చి ఐసొలేషన్‌లో ఉంచాలి. చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స అందించాలి. ఇతరులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

భయం వద్దు
మంకీపాక్స్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్‌సీడీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని తెలిపింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే తీవ్రత పెరుగుతుందని చెప్పింది. మరణాల రేటు 1-10 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.

వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు
మంకీపాక్స్ వ్యాధి నిర్దార‌ణ, చికిత్స‌ల‌పై వైద్య ఆరోగ్య శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించింది. పరీక్షల నిమిత్తం ఉమ్మి, రక్తం, రక్తనాళాల్లోని ఇతర ద్రవాల శాంపిళ్లను సేకరించి పూణెలోని ఎన్‌ఐవీకి పంపాల్సి ఉంటుంది. అనుమానితుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా నిఘా అధికారి లేదా ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం అధికారికి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ పాజిటివ్‌ కేసు నమోదైతే కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలి. బాధితులు గత 21 రోజుల్లో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో గుర్తించి వారిని ఐసొలేట్‌ చేయాలి.