డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు లభ్యం

తెలంగాణ సినిమా

డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు లభ్యం
ద‌ర్శిని ప్ర‌తినిధి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కీల‌క అధారాలు సేక‌రించారు. కోట్లలో సాగుతున్న డ్రగ్ మాఫియాపై ఈడీ దృష్టి సారించింది. విదేశాల నుంచి ఎల్ఎస్డీ, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ దిగుమతి అవుతోంది. ఒక్క గ్రాము కొకైన్ విలువ దాదాపు రూ.10 వేల వరకు ఉంటుంది. టాలీవుడ్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్‌కు అమెరికాలోని షికాగోలో ఉన్న అంతర్జాతీయ మత్తుమందుల ముఠాతో సంబంధాలు ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచే మత్తుమందులు దిగుమతి చేసుకున్నట్లు కెల్విన్‌ విచారణలో వెల్లడించాడు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చి అంతర్జాలం ద్వారా చెల్లింపులు చేసినట్లు చెప్పాడు. కొరియర్ల ద్వారా అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికాల నుంచి డ్రగ్స్ దిగుమతి అయ్యేదని, మూడు ప్రైవేట్ కొరియర్ సంస్థలతోపాటు తపాలా ద్వారా డ్రగ్స్ సరఫరా అయ్యేదని, వాటికి చెల్లింపులు ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలోనే జరిగేదని వెల్లడించాడు. డ్రగ్స్ కొనుగోలుకు విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు, డబ్బంతా ఎక్కడిది వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది.