అల్లాపూర్ స‌ర్పంచ్‌కు ఊర‌ట‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అల్లాపూర్ స‌ర్పంచ్‌కు ఊర‌ట‌..!
– స‌స్పెన్ష‌న్ ఆర్డ‌ర్‌పై హైకోర్టు నుంచి స్టే
– ఉత్త‌ర్వుల‌ను నిలిపి వేయాల‌ని ఆదేశాలు
తాండూరు రూర‌ల్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇటీవ‌ల స‌స్పెన్ష‌న్‌కు గురైన తాండూరు మండ‌లం అల్లాపూర్ స‌ర్పంచ్‌కు ఊర‌ట ల‌భించింది. పంచాయ‌తీ నిధుల ద‌ర్వినియోగం, అవ‌క‌త‌వ‌క‌ల అభియోగాల‌పై ఈనెల 18న వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ పంచాయ‌తీ స‌ర్పంచ్ నందినిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి వివ‌రాల్లోకి వెళితే.. అల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కొన‌సాగుతున్న‌ నందినిపై నిధుల వినియోగంలో ఆమె దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రామ వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై తాండూరు మండల పంచాయతీ అధికారి విచారణ జరిపి రూ. 8 లక్షల 5వేల 760లు, మరో రూ.2 లక్షల 66 వేల 933ల నిధులలో అవకతవకలకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్ కు నివేధిక అందించారు. దీనిపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం పంచాయతీ సర్పంచ్ నందినికి సోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న సర్పంచ్ నందిని జిల్లా కలెక్టర్ కు సంజాయిషీ ఇచ్చుకున్నారు. అయితే ఈ సంజాయిషీ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడంతో పాటు స్టాక్ రిజిస్టర్, సంబంధిత రికార్డులను సమర్పించలేదని, రూ. 6లక్షల 50 వేల 651ల నిధులలో దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(6) ప్రకారం సర్పంచ్ నందినిపై ఆరు మాసాలు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై స‌ర్పంచ్ నందిని హైకోర్టులో పిటిష‌న్ ధాఖ‌లు చేశారు. స‌ర్పంచ్ త‌రుపు న్యాయ‌వాది వాద‌న‌లు వినించారు. పంచాయ‌తి రాజ్ చ‌ట్టానికి విరుద్దంగా స‌ర్పంచ్‌ను స‌స్పెండ్ చేశార‌ని సోమ‌వారం విడుద‌ల చేసిన కోర్టు ఉత్త‌ర్వుల‌లో తెలిపారు. పంచాయ‌తీ అధికారి నిబంధ‌న‌ల విరుద్దానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌కు సంజాయిషి ఇచ్చినా సంతృప్తి కరంగా లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశార‌ని తెలిపారు. దీంతో పంచాయ‌తీ స‌ర్పంచ్ స‌స్పెన్ష‌న్‌ను నిలిపివేయాల‌ని హైకోర్టుకు స్టే ఇచ్చింది. దీంతో అల్లాపూర్ స‌ర్పంచ్ నందిని యాద‌య్య గౌడ్‌కు ఊర‌ట ల‌భించింది.