విద్యార్థుల‌కు ఆర్టీసీ షాక్..!

కెరీర్ తెలంగాణ హైదరాబాద్

విద్యార్థుల‌కు ఆర్టీసీ షాక్..!
– 150 శాతం బ‌స్ పాస్ చార్జీల పెంపు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇప్ప‌టికే సామాన్యుల‌పై భారం మోపిన ఆర్టీసీ చ‌దువుకునే విద్యార్థుల‌కు కూడ‌ షాక్ ఇచ్చింది. డీజీల్ సెస్ పేరుతో రెండు రోజుల క్రితం బస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. తాజాగా విద్యార్థుల‌పై భారం మోపుతూ బస్ పాస్‌లపైనా రేట్లు పెంచింది. ఏకంగా 150 శాతం మేర బస్ పాస్ రేట్లు పెరిగాయి. కొవిడ్(Coronavirus) కారణంగా గత రెండేళ్లుగా కాలేజీలు సరిగా రన్ కాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితిలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇంకో వారంలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 15 నుంచి విద్యార్థులకు కొత్త పాస్ లు ఇవ్వనున్నారు. బ‌స్ పాస్ చార్జీల పెంపుతో 4కిలోమీటర్ల దూరానికి ఇన్నాళ్లూ 165 రూపాయలు ఉంటే.. ఇకపై 450 రూపాయలు పెడితేనే పాస్ ఇస్తారు. 8కిలోమీటర్ల దూరానికి 200 రూపాయల నుంచి.. 600 రూపాయలకు బస్ పాస్ రేట్ పెరిగింది. ఇప్పటివరకూ 245 ఉన్న రూట్‌ బస్‌పాస్ ఇప్పుడు 900 రూపాయలు అయింది. 280 ఉన్న బస్‌పాస్‌‌ను ఇక నుంచి 1150 రూపాయలకు హైక్ చేశారు. 22కిలోమీటర్ల దూరానికి 330 ఉన్న బస్‌పాస్ ఇకపై 1350 రూపాయలు. డీజిల్‌సెస్ పేరుతో నిన్న టికెట్ రేట్లు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు బస్‌పాస్‌లపై భారీగా రేట్లు పెంచింది. ప్రతి నెలా విద్యార్థుల బస్ పాసులతో ఆర్టీసీకి 8 కోట్ల రూపాయల అదాయం వస్తుంది. పెరిగిన చార్జీలతో ఇకపై నెలకు 15 కోట్ల రూపాయలు రానుంది. ఈ లెక్క‌న ఏడాదికి 180 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో రేట్లు పెంచడం విద్యార్ధులకు కొంత భారంగా మారింది.