తాండూరులో ముమ్మ‌ర త‌నిఖీలు!

క్రైం తాండూరు వికారాబాద్

తాండూరులో ముమ్మ‌ర త‌నిఖీలు
– పేలుడు పదార్థాలపై పోలీసు బృందాల ఆరా
– ప్రయాణ ప్రాంగణాలు, మందిరాలలో పరిశీలన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పై జిల్లా పోలీసులు ముమ్మ‌ర త‌నిఖీలు నిర్వ‌హించారు. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు తాండూరులో విస్తృతంగా తనిఖీలు కొన‌సాగాయి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ బృందాల సభ్యులు తనిఖీలు చేశారు. ప్రయాణ ప్రాంగణాలలో ప్రయాణికుల బస్తాలు, వస్తువులను ప్రత్యేక పరికరాలతో తనిఖీ చేశారు. ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయేమో.. అంటూ ఆరా తీశారు. పేలుడు ప‌దార్థ‌లు నిర్వీర్యం చేసే నిపుణుల‌తో ఈ త‌నిఖీలు చేప‌ట్టారు. ఇదిలా ఉండగా సాయంత్రం వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ప్రకటనను జారీ చేశారు. ప్రజల శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమమే పోలీసు శాఖ ధ్యేయమన్నారు. ఎక్క దైనా.. ఎవరైనా పేలుడు పదార్థాలు ఉంచుకున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తాండూరులో తనిఖీలు చేపట్టిన బృందాలలో బీడీ టీం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సంజీవయ్య బృందాల సభ్యులు పాల్గొన్నారు.