అప్ప‌నంగా అమ్ముతున్నారు

జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

అప్ప‌నంగా అమ్ముతున్నారు
– ప్ర‌భుత్వ రంగ ఆస్తుల విక్ర‌యానికి కుట్ర
– రాష్ట్రాల హక్కుల‌ను కాల‌రాస్తున్న మోడీ స‌ర్కారు
– కేంద్ర మంత్రికి రాసిన లేఖ‌లో కేటీఆర్
హైదరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌భుత్వం రంగ ఆస్తుల‌ను అప్ప‌నంగా అమ్మేందుకు మోడీ ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. ఆదివారం తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, హెచ్‌ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా అమ్ముతోంది. ఈ ఆరు సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో దాదాపు 7,200 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి విలువ కనీసం రూ.5 వేల కోట్లపైగా, బహిరంగ మార్కెట్‌లో రూ.40 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి అని కేటీఆర్‌ లేఖలో కోరారు. మరోవైపు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మే ప్రయత్నాలపై పునరాలోచన చేయాలని సూచించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలు చేయని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరణ పేరుతో వాటి ఆస్తులను అప్పనంగా అమ్ముతోందని దుయ్యబట్టారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతోపాటు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాల‌రాస్తున్న‌ట్లు ఉంద‌ని మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క‌హానీలు చెబుతున్న మోదీ స‌ర్కారు.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బీజీగా ఉందని విమర్శించారు.