ముంబయి వెళ్లిన సత్యమూర్తి..!
– శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీసీ ఫుటేజీలో ప్రత్యక్షం
– ముమ్మరంగా కొనసాగుతున్న పోలీసులు విచారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : భార్య మిస్సింగ్ కేసులో పోలీసులకు గడువు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యమూర్తి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం అయ్యారు. అటు నుంచి పిల్లలతో కలిసి ముంబయ్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సత్యమూర్తికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు ప్రకటించారు. గత మూడు నెలల క్రితం తన భార్య అన్నపూర్ణ అదృశ్యమైన పోలీసులు కేసు చేధించడం లేదనే ఆవేధనలో సత్యమూర్తి పిల్లలతో కలిసి సెల్పీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భార్య ఆదృశ్యం కేసును చేధించాలని పోలీసులకు 48 గంటల గడువు ప్రకటించి, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేధన వ్యక్తం చేశారు. కొద్ది సేపటికే సత్యమూర్తి పిల్లలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసుపై తాండూరు డీఎస్పీ జి.శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. ఈ మేరకు పోలీసు బృందాలు గాలింపు చేపట్టారు. సత్యమూర్తి తన కారులతో పిల్లలతో కలిసి పరిగి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు నిర్ధారించారు. ఏయిర్ పోర్టులో సత్యమూర్తి పార్కింగ్ చేసిన కారును కూడ గుర్తించారు. అక్కడి అధికారులను కలిసి సత్యమూర్తికి సంబంధించి సీసీ పుటేజీలను సేకరించారు. ఈ వివరాలను పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మీడియాకు ప్రకటించారు. దీని ప్రకారం సత్యమూర్తి ముంబయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.



