రేషన్ లబ్దిదారులకు శుభవార్త
– వచ్చేనెలలో పెంచిన బియ్యం పంపిణీ
– ఒక్కొక్కరికి ఎన్ని కిలోలంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో లబ్దిదారులకు పెంచిన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద కరోనా సంక్షోభం నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పలుమార్లు ఈ పథకాన్ని పొడిగించిన కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు కూడా ఈ పథకం కింద ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మే నెలలో ఈ ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పేద లబ్దిదారులకు రేషన్ కష్టాల నుంచి ఊరట లభించనుంది.



