గుట్టుగా రేషన్ దందా..!

క్రైం తాండూరు వికారాబాద్

గుట్టుగా రేషన్ దందా..!
– పండ్ల వ్యాపారి బాగోతాన్ని ర‌ట్టు చేసిన పోలీసులు
– ఇంట్లో నిల్వ ఉంచిన 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌భుత్వం పేద‌ల‌కు పంపిణీ చేస్తోన్న రేష‌న్ బియ్యంతో ఓ పండ్ల వ్యాపారి దందాకు దిగాడు. గ‌త రెండు నెల‌లుగా బియ్యాన్ని తక్కువ ధరకు కొని ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తూ వ్యాపారం కొన‌సాగిస్తున్నాడు. విశ్వ‌స‌నీయ స‌మాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సివిల్ స‌ప్ల‌య్ అధికారులతో క‌లిసి గుట్టుగా సాగిస్తున్న దందాను ర‌ట్టు చేశారు. ఈ సంఘ‌ట‌న శుక్ర‌వారం తాండూరు ప‌ట్ట‌ణ పోలీస్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ప‌ట్ట‌ణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరమ్మ కాలనీకి చెందిన స‌య్య‌ద్ ఇర్ఫాన్ పండ్లవ్యాపారం చేసేవాడు. అయితే ప్ర‌తి నెల పేద‌ల వ‌ద్ద నుంచి రేష‌న్ బియ్యాన్ని కొని పట్టణంలోని సీతారాం పేట్ రైల్వే గేటు సమీపంలో ఓ ఇంట్లో నిల్వ‌ ఉంచి వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ సివిల్ స‌ప్ల‌య్ డిప్యూటీ త‌హ‌సీల్దార్ వెంక‌టేశంతో క‌లిసి సంఘటనా స్థలంలోని ఇంటిని సోదా చేశారు. దీంతో దాదాపు 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలు లభించాయి. రెండు నెలలుగా ఈ తంతు కొనసాగుతుందని వ్యాపారి విచారణలో తెలిపినట్లు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోదాంకు తరలించారు. ఈ మేరకు ఇర్ఫాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.