ప్లాస్టిక్ ఉంటే జరిమాన తప్పదు
– నిషేధ అమలుకు బల్దియా సిద్దం
– ముందు నోటీసులు, తర్వాత తనిఖీలు
– మొదలైన అమలు కార్యాచరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇకపై ప్లాస్టిక్ కవర్లు గాని, వస్తువులు గాని అమ్మినా లేదా వినియోగించినా జరిమానల మోత తప్పదంటున్నారు మున్సిపల్ అధికారులు. భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ప్లాస్టిక్ నిషేధాన్నా పక్కాగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు సూచిస్తున్నారు. ముందుగా వ్యాపారులకు నోటీసులు అందించి.. గడువు ఇవ్వడం జరుగుతుందని, తర్వాత తనిఖీలు చేపట్టడం జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ సిబ్బంది తాండూరు పట్టణంలోని దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, స్వీటు హౌస్ తో పాటు హోల్ సేల్, రీటైల్ వ్యాపారుల దుకాణాలలో ప్లాస్టిక్ నిషేధం నోటీసులను అందజేశారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు జులై 1 నుంచి 120 మైక్రోన్ల కన్న తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు నిషేధంలోకి వచ్చాయని, ఇకనుంచి వాటిని విక్రయించడం, వినియోగం చేయరాదని వ్యాపారులకు సూచించారు. నిబంధనలను విరుద్ధంగా ఎవరైనా విక్రయాలకు గాని, వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వచ్చే సోమవారం నుంచి తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ఇందులో పట్టుబడితే జరిమానాలు విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. జరిమానాలు రూ. 50 వేలకు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నోటీసులను అందజేసిన వారిలో మున్సిపల్ జవాన్లు అశోక్, బొట్టు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.



